Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మామిడి పండు తింటే షుగర్ పెరుగుతుందా?.. అపోహలు వీడి నిజాలు తెలుసుకోండి!

Does Mango Increase Sugar Levels Facts About Diabetes and Mango
Advertisement
  • షుగర్ ఉన్నవారు మామిడి పండ్లకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదంటున్న నిపుణులు
  • మామిడిలో ఉండే 'మ్యాంగిఫెరిన్' అనే పదార్థం షుగర్‌ను నియంత్రించడంలో సాయం
  • మామిడి పండు గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువ నుంచి మధ్యస్థంగానే ఉంటుందని వెల్ల‌డి
  • ప్రొటీన్ లేదా ఫ్యాట్ ఉన్న ఆహారంతో కలిపి తింటే షుగర్ పెరిగే అవకాశం మరింత ‌తక్కువ 
Advertisement
వేసవి కాలం వచ్చిందంటే చాలు, మామిడి పండ్ల సందడి మొదలవుతుంది. అయితే, ఈ పండ్ల తియ్యదనం మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారికి మాత్రం ఆందోళన కలిగిస్తుంది. మామిడి పండు తింటే రక్తంలో చక్కెర స్థాయులు (షుగర్ లెవెల్స్) అమాంతం పెరిగిపోతాయనే భయంతో చాలామంది వాటికి దూరంగా ఉంటారు. కానీ, ఈ విషయంలో పోషకాహార నిపుణులు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మామిడి పండును సరైన పద్ధతిలో, సరైన మోతాదులో తీసుకుంటే డయాబెటిస్ ఉన్నవారు కూడా దాని రుచిని ఆస్వాదించవచ్చని స్పష్టం చేస్తున్నారు.

మామిడి పండుపై అపోహలు ఎందుకు?
మామిడి పండులో సహజంగానే చక్కెరలు అధికంగా ఉంటాయి. అందుకే దీనిని 'హై షుగర్ ఫ్రూట్' అని భావిస్తుంటారు. అయితే, ఇందులో కేవలం చక్కెర మాత్రమే కాకుండా మన శరీరానికి మేలు చేసే అనేక పోషకాలు కూడా ఉన్నాయని పోషకాహార నిపుణురాలు దీప్‌శిఖా జైన్ వివరిస్తున్నారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.

మామిడిలో షుగర్‌ను నియంత్రించే గుణం
మామిడి పండులో 'మ్యాంగిఫెరిన్' అనే ఒక ప్రత్యేకమైన పాలీఫెనాల్ ఉంటుంది. దీనికి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో పాటు యాంటీ-డయాబెటిక్ గుణాలు కూడా ఉన్నాయి. ఈ మ్యాంగిఫెరిన్ రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణకు సహాయపడగలదని దీప్‌శిఖా జైన్ పేర్కొన్నారు. అంతేకాకుండా, మామిడి పండు గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) కేవలం 51 మాత్రమే. ఇది తక్కువ నుంచి మధ్యస్థ కేటగిరీ కిందకు వస్తుంది. అంటే, దీనిని తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయులు వేగంగా పెరగవు. ఇందులో ఉండే ఫైబర్, చక్కెర నెమ్మదిగా రక్తంలో కలిసేలా చేస్తుంది.

ఎలా తినాలి?.. ఇదే ముఖ్యం!
డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండును ఎలా తింటున్నారన్నదే అత్యంత ముఖ్యమైన విషయం. పండును నేరుగా తినకుండా జ్యూస్ లేదా మిల్క్‌షేక్ రూపంలో తీసుకుంటే ఫైబర్ తొలగిపోయి, షుగర్ స్పైక్ అయ్యే ప్రమాదం ఎక్కువ. అలాగే, భోజనంతో పాటుగా లేదా భోజనం చేసిన వెంటనే తినడం కూడా మంచిది కాదు.

సరైన పద్ధతులు:
  • మామిడి పండును రసంలా కాకుండా, ముక్కలుగా కట్ చేసుకుని నేరుగా తినాలి.
  • భారీ భోజనంతో పాటుగా తినకుండా, స్నాక్‌గా తీసుకోవాలి.
  • పండును తినేటప్పుడు గ్రీక్ యోగర్ట్, నట్స్ వంటి ప్రొటీన్ లేదా ఆరోగ్యకరమైన ఫ్యాట్ ఉన్న ఆహారంతో కలిపి తీసుకుంటే, చక్కెర రక్తంలో కలిసే వేగం మరింత తగ్గుతుంది.
సో.. డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండ్లకు పూర్తిగా దూరం కావాల్సిన పనిలేదు. సరైన మోతాదులో, సరైన పద్ధతిలో తీసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. ఆహారం గురించి గుడ్డిగా భయపడటం కంటే, దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement
Advertisement
Mango
Diabetes
Deepshikha Jain
Sugar levels
Mangiferin
Glycemic Index
Diet
Nutrition
Health
Summer fruits

More Telugu News